వెల్దండ, ఏప్రిల్ 13: ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Jaipal Yadav) పిలుపునిచ్చారు. వెల్దండ మండల కేంద్రంలోశనివారం రజతోత్సవ సభ గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా రైతుబంధు, రుణమాఫీ, విద్యుత్ కోతలను వివరించాలని తెలిపారు.
మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.7 వేలు ఇస్తామని ఎన్నికల్లో అమలు కానీ హామీలను ఇచ్చినట్లు ప్రజలకు తెలపాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.