కొల్లాపూర్, ఏప్రిల్ 01 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థి లోకం ఖండించాలని ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం.తారాసింగ్, పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు బత్తిని రాము అన్నారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని పీజీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో నిర్భందాలు ఉండవని చెప్పి అక్రమంగా అరెస్టు చేస్తూ జైళ్లపాలు చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నట్లు చెప్పారు.
ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎర్రం నవీన్‌ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వరకు ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా, ఫోన్ లాక్కొని హించించి రిమాండ్ చేయడం దారుణమన్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే పోలీసులు జిల్లాలో 298 ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.శివవర్మ, బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాస్, నాయకులు నవీన్, అభినయ్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.