కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ సమీపంలోని దేవుని గట్టుపై వెలసిన శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవదశ 19వ వార్షికోత్సవం ఈనెల రెండవ తేదీ నుంచి కనుల పండుగగా జరుగుతుంది. రెండవ తేదీ గణపతి పూజ పుణ్యవచనం ఆచార్యాది పృథ్వి గ్వరణము మాతృక పూజ నాంది మంగళ హారతి చతుర్వేద స్వస్తి ఆశీర్వచనములు ప్రాదోష పూజలు ధ్వజారోహణము తీర్థ ప్రసాదములతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మూడవ తేదీ పాతకాల పూజలు అభిషేకములు జరిగాయి. 4వ తేదీ గురువారం తెల్లవారుజాము నుంచే వార్షికోత్సవంలో ప్రధాన ఘట్టమైన శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘట్టాన్ని వేద పండితులు ప్రారంభించారు.
దీక్ష హోమం లక్ష్మి పాశువత హోమములు శాంతి హోమము శుభమూర్తులకు చక్ర స్నానం చేయించిన అనంతరం కళ్యాణ వేదికపై పండితులు తీసుకొని వచ్చారు. అశేష జన సందోహం భక్తుల గోవింద నామాల మధ్య వేద పండితుల మంత్రో చరణాల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ప్రముఖులు కళ్యాణం ఉత్సవంలో పాల్గొని ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సలహాదారులు జూపల్లి రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ నల్లవెల్లి చంద్ర యాదవ్, గ్రామ పెద్దలు కొమ్మ గోపాల్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.