కొల్లాపూర్, మార్చి 21: రేవంత్ ప్రభుత్వం తెలుగు మత్స్యకారులకు ఇచ్చిన మాటను నెరవేర్చకుంటే తమ సత్తా ఏంటో చూపెడతామని అధికార పార్టీ నాయకులను ఇండ్ల ముందుకు కూడా రానివ్వమని, వచ్చే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని తెలుగుబెస్త రాష్ట్ర నాయకులు జలక మద్దిలేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు వెళ్తున్న తెలుగు మత్స్యకారులను, మత్స్యకార నాయకులను అరెస్టు చేసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తెలుగు మత్స్యకారులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల ముందు తెలుగు మత్స్యకారుల ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా శాంతియుతంగా విన్నవించేందుకు వెళ్తున్న తెలుగు మత్స్యకారులను అరెస్టు చేయడం అంటే ఏరు దాటినాక పుట్టి ముంచినట్లు తీరుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో తెలుగు మత్స్యకారుల హక్కులను కాలరాస్తాం అనుకుంటే ప్రభుత్వం పొరపాటు పడినట్లేని తెలుగు మత్స్యకారులు ఐకమత్యంతో ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేందుకు కూడా వెనకాడేది లేదని వారు హెచ్చరించారు.