బిజినేపల్లి, జూన్ 20 : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం అందజేయాలని, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ సజావుగా నిర్వహించాలని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండలం వెలుగొండ, బిజినేపల్లి గ్రామాల్లోని రేషన్ దుకాణాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి రేషన్ డీలర్ ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. వానాకాలం నేపథ్యంలో రవాణా, ఇతర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లోనే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటికే 65.69 శాతం పంపిణీ పూర్తయిందని వివరించారు. ఇప్పటి వరకు 1,60,351 మంది లబ్ధిదారులు మూడు నెలల సన్న బియ్యం అందుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న మొత్తం 2,43,720 రేషన్ కార్డులకు గాను జూన్, జూలై, ఆగస్టు నెలలకు బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మొత్తం 14,169.405 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇంకా బియ్యం అందుకోని లబ్ధిదారులు ఈ నెలాఖరు వరకు తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట బిజినేపల్లి తాసీల్దార్ మున్నూరోద్దీన్,రాజు, ఇతర అధికారులు ఉన్నారు.