నాగర్‌కర్నూల్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగా ణ) : డయాలసిస్.. మూత్రపిండాలు పనిచేయని రోగులకు అత్యవసరంగా జీ వితాంతం అందించాల్సిన చికిత్స. డీ హైడ్రేషన్, గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలతో మూత్రపిండాలు చెడిపోతాయి. శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్ ఐదో దశకు చేరినప్పుడు డయాలసిస్ అవసరమవుతుంది. కిడ్నీలు 80 శాతం పాడయ్యే వరకూ పనిచేస్తాయి. దీంతో సరైన అవగాహన లేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. ఈ క్రమంలో రక్తా న్ని డయాలసిస్ మిషన్ సాయంతో వడపోసి శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ దాదాపుగా నాలుగు గంటలు పడుతుంది. ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేయాల్సి ఉంటుంది. డయాలసిస్ చేయించుకోకుంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది.
ముదిరితే ప్రాణాపాయంగా మారుతుంది. అలాంటి అత్యవసరమైన చికిత్స ఒకప్పుడు పేదలకు అందని ద్రాక్షగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ విస్తృతంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోనూ 2018 ఫిబ్రవరిలో ఐదు బెడ్లతో డయాలసిస్ కేంద్రం ఏర్పడింది. దీంతో నల్లమలలోని అచ్చంపేట, కొల్లాపూర్ అటవీ ప్రాంతాల పేదలకు సైతం ఇక్కడే డయాలసిస్ అందుతున్నది.
ఈ కేంద్రంలో ఇప్పటివరకు వేల మందికి సేవలందాయి. ప్రతి నెలా 48 మంది వరకు డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. ఇందులో ప్రతిరోజూ ఐదు మందికి 20 నుంచి 22 సిట్టింగ్‌ల చొప్పున డయాలసిస్ అందుతున్నది. రోగి పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికీ నెలకు 8 నుంచి 12 సార్లు డయాలసిస్ తీసుకోవాల్సి ఉంటుంది. నెలలో పదిసార్లు డయాలసిస్ తీసుకున్నా.. ఒక్కరికి నెలకు రూ.30వేలకు పైగా ఆదా అవుతుంది. ఇలా ఏడాదికి రూ.3.60లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంతటి ఖరీదైన వైద్యం ఇప్పుడు ఉచితంగానే అందుతుండడం విశేషం. అయితే, కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. సరైన శారీరక ఆరోగ్య క్రమశిక్షణ పాటించకపోవడంతో దాదాపుగా 30 నుంచి 40 మంది వరకు డయాలసిస్ చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంకా బెడ్లను పెంచాల్సి ఉండగా.. అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే అదనంగా ఐదు పడకలు వచ్చే అవకాశమున్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయాలంటే ఆరోగ్యకర అలవాట్లు పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి మనిషి రోజుకు 8 గ్లాసుల నీటిని తాగాలి. రెడ్ క్యాప్సికం, వెల్లుల్లి, ఆపిల్ పండ్లు తినడం వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవద్దు. చక్కెర, మాంసాహారం తగ్గించాలి. పెయిన్ కిల్లర్ల వంటి మాత్రలు అధికంగా వాడొద్దు. చాలా మంది ఈ అనారోగ్యకర లక్షణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. మొత్తమ్మీద డయాలసిస్ కేంద్రాలు పేదలకు సంజీవనిలా మారాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
కిడ్నీ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు క్రమంగా కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. అతిగా మాత్రలు వాడొద్దు. నెలలో 48 మందికి డయాలసిస్ అందిస్తున్నాం. ఇంకో 30 మందికిపైగా పేదలు రిజర్వ్‌లో చికిత్సకోసం ఎదురుచూస్తున్నారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఐదు బెడ్ల కోసం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులకు నివేదించాం.
– డా.రఘు, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్