కొల్లాపూర్, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగామాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమందరం ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక బాబాసాహెబ్ కృషి ఎంతో ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమన్యాయం ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత నేత అని కొనియాడారు.
భారతదేశ సమగ్ర సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ రచన చేసి, భావి తరాలకు దిశానిర్దేశం చూపిన దార్శనికుడని వెల్లడించారు. బడుగు, బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భావించి, అంతరాలు లేని భారతీయ సమాజం కోసం పరితపించి భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదాని పిలుపునిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. ఆయన విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేసి దేశంలోనే ఓ మహోన్నతమైన, ఆదర్శమైన పరిపాలన అందించారని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.10 లక్షల నగదును అందించారని, తద్వారా దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మాత్రం దళిత బంధు పథకాన్ని నిలిపివేసి దళిత ద్రోహిగా ముద్ర వేసుకుందని విమర్శించారు.