ఊట్కూర్, ఏప్రిల్ 05: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని మగ్ధంపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు (Annual Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాజ్ మాట్లాడుతూ.. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన చేపట్టి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక విభాగం, క్రీడల్లో రాణించాలని సూచించారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు. పాఠశాలలో చదివి గురుకుల విద్యాలయాలకు ఎంపికైన విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, జిల్లా నాయకులు సత్యపాల్, భాస్కర్, ఉపాధ్యాయులు మహేష్, నర్మద, శ్రీదేవి, ఆదర్శ పాఠశాల చైర్మన్ సత్యమ్మ పాల్గొన్నారు.