నాగర్‌కర్నూల్, నవంబర్ 1 : నల్లమల అటవీ ప్రాంతం తెలంగాణకు తలమానికమని, దానిని కా పాడి భావితరాలకు అందించడమే గొప్ప సంపద అ ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తిరుమల్ ఫంక్షన్హాల్లో కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో ని పోడు భూములు, అడవుల సంరక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారం కింద 20 శాతం ఉన్న అడవిని 24 శాతానికి పెంచామన్నారు. మానవ నిర్మిత అటవీ ప్రాంతాన్ని పెంచుతున్న రాష్ట్రంగా ప్రశంసలు దక్కాయన్నారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ సమస్యకు పరిష్కారం జరిగితే దీర్ఘకాలంగా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకొని అడవులను సంరక్షిస్తామని చెప్పారు. ఇందుకోసం అటవీ భూములే ఉపాధిగా జీవిస్తున్న ఆదివాసులు, గిరిజనులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించి, పట్టాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 2005 వరకు అటవీ భూములు సాగు చేస్తున్న వారికి హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వందశాతం ప్రామాణికత పాటిస్తామన్నారు.
అటవీ సంరక్షణ, భూములపై డివిజన్, సబ్ డివిజన్, గ్రామ స్థాయిలో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి అర్హులకు పట్టాలు ఇస్తామన్నారు. ఎవరు ఎంత మేర ఆక్రమణలో ఉన్నారన్న విషయాలను రికార్డు చేస్తామన్నారు. జిల్లా భూ విస్తీర్ణం 16,17,305 ఎకరాలు కాగా.. అటవీ విస్తీర్ణం 5,96,898 ఎకరాలు ఉందన్నారు. 36 రెవెన్యూ గ్రామాల పరిధిలో 7,449.68 ఎకరాల అటవీ భూమి (1.25 శాతం) 2,302 మంది ఆక్రమణలో ఉందన్నారు. 2005 ముందు వరకు 1,018 మంది చేతుల్లో 3,374 ఎకరాలు, 2005 తర్వాత 1,284 మంది చేతుల్లో 4,975.68 ఎకరాలు ఆక్రమణలో ఉందన్నారు. పోడు భూముల క్రమబద్ధీకరణకు సహకరించాలన్నారు. అనంతరం ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అర్హులైన రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ, ఫారెస్టు ఆధ్వర్యంలో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, సమన్వయంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులపై ఫారెస్టు అధికారులు సామరస్యంగా మసలుకోవాలని సూచించారు. పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. భూములకు కొలతలు, రికార్డింగ్ చేయడానికి వేసే కమిటీల్లో అఖిలపక్షాలను భాగస్వాములు చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, అదనపు కలెక్టర్లు మనూచౌదరి, శ్రీనివాస్‌రెడ్డి, డీఎఫ్‌వో కిష్టగౌడ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అఖిలపక్షాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.