Islamisation : అమెరికాలోని పలు నగరాల్లో పెరిగిపోతున్న ఇస్లామైజేషన్పై అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత నగరమైన డల్లాస్ తనకు పాకిస్తాన్లా అనిపిస్తోందని రిపబ్లికన్ నేత బ్రాండన్ గిల్ వ్యాఖ్యానించారు. డల్లాస్ నగరంతోపాటు అమెరికాలో పెరుగుతున్న ఇస్లామైజేషన్పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్సాస్ నగరంలోని ఒక మాల్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బ్రాండన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ముస్లింలు భారీ సంఖ్యలో వలస రావడం వల్ల మనకు తెలిసిన, మనం ప్రేమించే నిజమైన అమెరికా అంతమవుతోంది. ముఖ్యంగా డల్లాస్ నగరం ఇస్లామీకరణగా మారడంపై చాలా మంది అమెరికన్లు ఆవేదనకు, నిరాశకు లోనవుతున్నారు. తరాలుగా మనకు సొంతమైన నేలపై మసీదులు పుట్టుకొస్తున్నాయని స్థానికులు ఆవేదనగా చెబుతున్నారు. ఈ చారిత్రక నగర పరిసరాలు మొత్తం మారిపోతున్నాయి. డల్లాస్‌లోని మాల్స్‌కు వెళ్లి చూడండి. అక్కడ చూస్తే డల్లాస్‌లో ఉన్నట్లు లేదు. పాకిస్తాన్లో ఉన్నట్లు ఉంది. టెక్సాస్ ప్రజలు డల్లాస్‌ను చూడాలి.
మన సంస్కృతి, సమాజం, ప్రదేశాలు మొత్తం సిద్ధాంతపరంగా మారిపోయాయి’’ అని బ్రాండన్ అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై అమెరికన్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. గతంలో ఆయన ముస్లింల దగ్గరకు ఫండ్స్ కోసం వచ్చారని విమర్శిస్తున్నారు.