అచ్చంపేట రూరల్, జూలై 5: ‘పల్లె ప్రగతి’తో పల్లెలు పచ్చబడాలని, పల్లెల్లో సకల సమస్యల పరిష్కారం, అభివృద్ధి సాగాలంటే ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. సోమవారం పట్టణ సమీపంలోని షామ్స్ ప్యాలెస్‌లో ఉపాధి హామీ పథకం అమలుపై ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సకల సమస్యలు పరిష్కారం కావాలన్నా, రైతులు, కూలీలు ఆర్థికంగా బలోపేతం చెందాలన్నా ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.350కోట్లను విడుదల చేస్తున్నట్లు గుర్తు చేశారు. పల్లెప్రగతి పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిరంతరం కొనసాగిస్తూ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలకు చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో ఇప్పటికే డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని, ప్రకృతివనాలు పల్లెల్లో ఆహ్లాదాన్ని పెంచుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రతిఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు, వ్యవసాయ పొలాల్లో పశువుల పాకలు, కల్లాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరును సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి, బల్మూర్, మన్ననూర్ రిజర్వాయర్ నిర్మాణాలను నిర్మించేందుకు ప్రకటన చేసినట్లు స్పష్టం చేశారు. మరో రెండేండ్లలోగా నియోకవర్గంలోని ప్రతి సెంటు గుంటకు సాగు నీరందించే విధంగా కట్టుబడి ముందుకెళ్లనున్నట్లు భరోసానిచ్చారు. ఈజీఎస్ పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్స్ 70శాతం అణగారిన వర్గాల ప్రజలేనని, వారిని మళ్లీ విధులకు తీసుకునే అంశాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు ఉన్నత చదువుల కోసం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భరోసానిచ్చారు. సమావేశంలో డీఆర్డీవో నర్సింగ్‌రావు, అదనపు డీఆర్డీవో నటరాజ్, డీపీవో రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మార్కెట్ చైర్మన్ సీఎం రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు రమేశ్‌రావు, శివ, నాయకులు తిరుపతయ్య, సింగిల్‌విండో చైర్మన్ రాజీరెడ్డి, నర్సయ్య, సర్పంచ్ లోక్యానాయక్, ఆయా మండలాల ఎంపీపీలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు
లింగాల, జూలై 5: తెలంగాణాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించగా విప్ గువ్వల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ప్రజాప్రతినిధులు, అధికారుల విధులపై ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, 57ఏండ్లు పైబడిన పేదలందరికీ ఆసరా పింఛను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పథకాల విషయంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉంటూ అర్హులైన వారిని గుర్తించాలని ఆదేశించారు. కొత్తకుంటపల్లిలో అక్రమంగా నాటుసారా, మద్యం విక్రయిస్తున్న వారిపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆ శాఖవారికి సూచించారు. పల్లెప్రగతి, హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేసి హరితగ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ మునిరోద్దీన్, ఎంపీడీవో గీతాంజలి, ఏవో నాగార్జునరెడ్డి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.