వెల్దండ, సెప్టెంబర్ 28 : అధికారుల పర్యవేక్షణ లోపం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటలు నష్టపోయో ప్రమాదం ఏర్పడింది. మండలంలోని పోతెపల్లి గ్రామ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు 11వ సారి గండి పడిందని రైతులు తెలిపారు. ఇలా కాల్వలకు గండి పడడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం తెల్లవారు జామున కాల్వ తెగడంతో నీరు వృథాగా పారుతున్నది. ఇదిలా ఉండగా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు తెగిన కాల్వ మరమ్మతుల తర్వాత ఇటు వైపు మళ్లీ చూడడం లేదని ఆరోపిస్తున్నారు. కాల్వకు మరమ్మతులు చేసేందుకు చొరవ చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.