Nagar Kurnool DEO | కొల్లాపూర్, ఫిబ్రవరి 12 : పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ రమేష్ కుమార్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. బుధవారం పెద్దకొత్తపల్లి, కోడేరు మండలంలోని చంద్రకల్, పెద్దకొత్తపల్లి, కోడేరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు.. కోడేరు, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల గణిత, సైన్స్, సోషల్ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను డీఈఓ ఏ రమేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను ఆయా పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సాధించిందని డీఈఓ రమేశ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అదే తరహాలో విద్యార్థుల అభ్యున్నతికి పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపైన ఉంటుందన్నారు. రానున్న పదవ తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టు ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈవో ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయినా అందుకు బాధ్యులు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులదేనన్నారు.
విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బోధనలో మెళకువలు పాటించాలని డీఈఓ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంతోపాటు విద్యా ప్రమాణాలు పెంచాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సబ్జెక్టు ఉపాధ్యాయులు సద్వినియోగపర్చుకోవాలని అవసరమైన బోధన తరగతుల మెళకువలను పెంపొందించుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను డీఈవో పరిశీలించారు.
పదవ తరగతి విద్యార్థులతో డీఈవో రమేశ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలని చెప్పారు. అందుకు పదవ తరగతి సరైందన్నారు. ‘మీరు కష్టపడి బాగా చదివితే మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మీ చేతుల్లోనే మీ జీవితం ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వాటిని సాకారం చేసుకోవడమే మీ లక్ష్యంగా ఉండాలి ’ అని పేర్కొన్నారు.
కష్టించే విధానానికి ప్రత్యామ్నాయంలేదనీ, కష్టే ఫలి అనే నానుడి మరవరాదని డీఈఓ రమేశ్ కుమార్ తెలిపారు. మనం చేసే మంచి పనులే మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయన్నారు. చిన్నప్పటి నుంచి మంచి నడవడిక కూడా మంచి పౌరులుగా ఎదగడానికి దోహదం చేస్తాయని తెలిపారు. డీఈఓ వెంట సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల విద్యాధికారులు, పెద్దకొత్తపల్లి, కోడేరు పాఠశాలల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.