ఊట్కూర్, జూలై 19 : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నిండాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్తులు విశిష్ట అధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కృష్ణ మండలకేంద్రం సమీపంలోని కృష్ణానది నుంచి భజనలు చేస్తూ పవిత్ర జలాలను తీసుకొచ్చి బిజ్వారం పడమటి ఆంజనేయస్వామికి జలాభిషేకం నిర్వహించారు. ముందుగా స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రసుత్తం వర్షాభావ పరిస్థితులతో పత్తి, కంది వంటి ఆరుతడి మొలకలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వానదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి రైతులను, ప్రజలను ఆదుకోవాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. కార్యక్రమంలో పూజారులు నర్సింహాచారి, వేణుగోపాలాచారి, గ్రామస్తులు నర్సింహ, వెంకటప్పగౌడ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవపాడు, జూలై 19 : వానకాలం ప్రారం భం నుంచి నేటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని జామ మసీదు నుంచి ఆదివారం ముస్లింలు పిల్లలు, పెద్దలు కలిసి గ్రామం శివారులోని పంట పొలాల్లో వెళ్లి ప్రత్యేక నమాజ్ చేశారు. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తలంచి అందరి బాగుకోసం ఈ ప్రార్థనలు చేసినట్లు ముతావలి తెలిపారు.