మహబూబ్‌నగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అ త్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఒక్క నాగర్‌కర్నూల్ మినహా మిగతా చోట్లా అంత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు తమ డివిజన్లు వార్డుల నుంచి ర్యాలీగా రావడంతో మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్లు గడువు ముగిసే సమయానికి మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో సహా 18 మున్సిపాలిటీ లో సుమారు 1770 నామినేషన్లు దాఖలయ్యాయి.
అ యితే సమయం ముగిసిన కార్యాలయాల ఆవరణలో ఉన్న వారందరికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక అనుమతిని ఇ చ్చారు. చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీ ఎత్తున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇదిలా ఉండగా అన్ని పార్టీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. టికెట్ రాని చాలామంది ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసి పార్టీలకు సవాల్ విసురుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థిపై అదే పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు దాడికి దిగడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక చోట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో మరో వైద్య విద్యార్థిని ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏటిగడ్డ శాఖాపురం సర్పంచ్ స్థానానికి నిఖిత అనే ఎంబీబీఎస్ విద్యార్థిని పోటీ చేసి గెలుపొందింది. అదే బాటలో పురపాలిక ఎన్నికల్లోనూ మరో వైద్య విద్యార్థిని పవిత్ర పెబ్బేరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ స్థానానికి శుక్రవారం నామినేషన్ వేశారు.

ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. అలాగే అలంపూర్ మున్సిపాలిటీలో 9వ వార్డు కౌన్సిలర్‌గా మాధురి నామినేషన్ వేశారు. ఆమె హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ థర్డ్ ఇయర్ చదువుతోంది.
అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఆ వార్డు ఏకగ్రీవం కానున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తొలి బోణీ కొట్టింది. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని ఆయన మర్యాద పూర్వకంగా కలవగా.. శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేడు అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాల్లో ఏవై నా సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా అని నిశితం గా పరిశీలిస్తారు.
కాగా ఆయా మున్సిపాలిటీలో సక్రమంగా ఉన్న నామినేషన్లను కూడా అధికార పార్టీ నే తలు ఒత్తిడి తీసుకువచ్చి రిజెక్ట్ చేసే అవకాశం ఉం దని విమర్శలు వస్తున్నాయి. దీంతో స్కూృట్నీ కేంద్రా ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉం టుంది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తారు.
మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపార్టీలకు జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో చాలామంది రెబల్స్ బరిలో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను నిర్ణయించినప్పటికీ కొంతమంది టికెట్ రాకపోవడంతో నిరాశకు గురై ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రంగంలోకి నిలిచారు. దీంతో అన్ని పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు ఇంకా టైం ఉండడంతో పార్టీలు వారితో బుజ్జగింపుల పర్వాన్ని మొదలుపెట్టారు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఇదే రీతిలో చాలా మంది ఓటమి పాలయ్యారు. ఈసారి అలాగే జరగకుండా ఆయన పార్టీలు రెబల్స్‌ను నయానో భయానో ఒప్పిస్తున్నారు. మొత్తం పైన నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు.