చిన్నంబావి, జూలై 17 : బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్‌రెడ్డిని హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని మల్ట్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్‌రెడ్డి ఇంటి పరిసరాలను డీఐజీ ఎల్ఎస్చౌహాన్, జిల్లా ఎస్పీ గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, పోలీస్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ జితేందర్ కేసును త్వరగా ఛేదించాలని ఆదేశించినట్లు తెలిపారు. అందులో భాగంగానే తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు చెప్పారు. హత్య జరిగి 56 రోజులు అయినా నేటికీ నిందితులను గుర్తించకపోవడంతో ఈ కేసు విచారణకు డీఎస్పీ కృష్ణకిశోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా సీసీఎస్ సీఐ పాల్, ఆత్మకూర్ సీఐ శివకుమార్ ఉంటారన్నారు.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మీపల్లి వాసులు మండిపడ్డారు. హత్య కేసు విచారణకు వచ్చిన ఐజీ సత్యనారాయణతో మాట్లాడారు. హత్య జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసును వేగవంతం చేసి హత్య చేసిన వారిని గుర్తించాలని కోరారు. ఆయనవెంట సీఐ నాగభూషణరావు, ఎస్సై రమేశ్, పోలీసులు ఉన్నారు.