కొనుగోలు కేంద్రాలను తెల్లబంగారం ముంచెత్తనున్నది. ఇందుకోసం అధికారులు సన్నద్ధమయ్యారు. పత్తి పంట చేతికొస్తున్న క్రమంలో ముందుగానే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. సీసీఐ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 శాతం తేమ ఉంటేనే క్వింటాకు మద్దతు ధర రూ.6,380గా నిర్ణయించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు విక్రయించేలా మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేపట్టింది. కాగా భారీ వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోళ్లు చేపట్టనున్నది. పంట దిగుబడి ఎంత వస్తుందో అధికారులు అంచనాకు వచ్చారు. జిల్లా స్థాయిలో పత్తి కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. పత్తి అంచనాకు మించి వచ్చినా.. కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా పత్తి పంట బాగా దెబ్బతిన్నది. నీరు పట్టింది. చాలా చోట్ల ఎండు తెగులు సోకింది. మురిగిపోయి నల్లగా మారింది. నల్లమచ్చ తె గుళ్లు అధికంగా సోకాయి. దీంతో పూత, కాయ నేలరాలింది. ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపించనున్నది. దీనివల్ల మొక్కకు 20 నుంచి 30 వరకే కాయలు వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.., ఇప్పుడు 5 క్వింటాళ్ల వరకే వచ్చే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, పత్తిలో ఈ సారి విక్రయాలకు తేమ శాతమే ప్రధాన అవరోధంగా మారనున్నది.
రైతులు పత్తిని బాగా ఆరబెట్టుకుంటేనే గిట్టుబాటు ధర వచ్చే అవకాశమున్నది. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6,380 మద్దతు ధర నిర్ణయించింది. ఇక తేమ 12 శాతంగా ఉండాలని స్పష్టం చేసింది. తేమ లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు తెగుళ్లు సోకిన పంటను రక్షించుకునేందుకు ఎకరాకు 20 నీలి, తెలుపు రంగు జిగురు బుట్టలు అమర్చుకోవాలి. అలాగే పంట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనలతో మందులను వాడాలి. ఇలా సాగైన పంటలను మార్కెట్‌కి తీసుకొచ్చే వరకు 12 శాతం తేమ ఉంటే మద్దతు ధరకు మించి వచ్చే అవకాశమున్నది. ఉమ్మడి పాలమూరుతో పోలిస్తే నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 3.30 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. దీన్నిబట్టి 3.55 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. దీనికోసం జిల్లాలో 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అత్యల్పంగా వనపర్తిలో కేవలం 21 వేల ఎకరాల్లోనే పత్తి సాగైంది. మహబూబ్‌నగర్‌లో 1,15,380, నారాయణపేటలో 2,05,607, జోగుళాంబ గద్వాలలో 2,22,909 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు..
సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖ పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేపడుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 3.55 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందుకోసం 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోళ్లు చేపట్టేందుకు జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి. రైతులు తేమ శాతం 12 ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి మద్దతు ధర వస్తుంది. ప్రభుత్వం ఈ సారి క్వింటాల్‌కు రూ.6,380 మద్దతు ధర కల్పిస్తున్నది.
– బాలమణెమ్మ, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారిణి, నాగర్‌కర్నూల్