అలంపూర్, ఫిబ్రవరి 7 : అక్రమాల, అన్యాయాల, అబద్ధాల పీడిత పాలనను అంతమొందించాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెట్టాలని బీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. అమలు కాని హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేత బట్టి రాష్ట్రంలో అరాచక పాలన చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అలంపూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేత చీకొట్టించుకున్న మాజీ ఎమ్మెల్యే అధికార బలంతో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ అన్యాయాలు, అక్రమాలను ప్రోత్సహిస్తూ దుర్మార్గ పాలనకు తెరలేపారని ఆరోపించారు. నడిగడ్డలో అధికారులను కాంట్రాక్టర్లను బెదిరిస్త్తూ తన గుప్పెట్లో పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. నియోజకవర్గంలో భూ దందాలు, ఉద్యోగుల అక్రమ బదిలీలు, మట్టి, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో అమలుకు సాధ్యపడని ఆరు గ్యారెంటీల పేరుతో 420హామీలను ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి అందలమెక్కిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేతబట్టి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఏ ఒక్క హామి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కొత్త సంక్షేమ పథకాలు ఏమి తేలేదని..ఉన్నవి ఊడగొట్టిండ్రు అని అన్నారు. అందుకని ప్రజలు మరోసారి మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటును వేసి గెలినించాలని అభ్యర్థించారు. అలంపూర్ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించడంతో మున్ముందు మరింత అభివృద్ధి సాధ్యమైతుందన్నారు. కమీషన్ల కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం చెప్పాలంటే మీకు ఉన్న ఒకే ఒక అవకాశం ఓటు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.