మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 15 : మహబూబ్‌నగర్ పట్టణ మహిళా సమాఖ్య కోయనగర్ ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 33 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో కొన్ని సంఘాల బ్యాంక్ లింకేజీ రుణాలు పక్కదారి పట్టాయంటూ ‘మెప్మాలో గోల్మాల్’ అనే శీర్షికన ఈ నెల 9వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి అధికారులు, పాలకులు స్పందించారు. మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్, చనిపోయిన మహిళకు రుణం మంజూరు, మున్సిపల్, మెప్మా, బ్యాంక్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తీరు, రుణం తీసుకోకున్నా డబ్బులెలా కట్టాలంటూ మహిళా సంఘాల సభ్యుల ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, అధికారులు స్పందించారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో సంబంధిత మహిళా సంఘాల నిర్వహణ బాధ్యులతోపాటు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆయా సంఘాల సభ్యులతో విచారణ చేపట్టారు. నిబంధనలకనుగుణంగా వ్యవహరించకుండా ఇలా ఎం దుకు చేస్తారంటూ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తప్పు అని తేలితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళా స్వయం సహాయక సం ఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సి ఉం డగా.. పర్యవేక్షణ మరిచి పక్కదారి పట్టేలా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. కచ్చితమైన సమ గ్ర వివరాలు నివేదిక రూపంలో అందించాలని సూచించారు. పాలమూరుకు చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించొద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారు లు, సిబ్బంది పాల్గొన్నారు.