ఉండవెల్లి, సెప్టెంబర్ 17 : కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఎమ్మెల్యే విజయుడు ప్రినిపాల్ పరిమళను సూచించారు. మండలంలోని కలుగోట్ల గ్రామంలోని కస్తూర్బా పాఠశాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తరగతి గదులు, హాస్టల్ గదులను పరిశీలించి విద్యార్థుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలుగోట్ల గ్రామం నుంచి కస్తూర్బా పాఠశాలకు వచ్చే రోడ్డు గుంతల మయంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చేందుకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో పాఠశాలకు వచ్చినప్పుడు రోడ్డు బాగలేదని విద్యార్ధులు నా దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్‌తో మాట్లాడి రోడ్డు పనుల కోసం రూ.5లక్షలు మంజూరు చేయించినట్లు చెప్పారు. రోడ్డు పనులకు నిధులు మంజూ రు చేయించిన ఎమ్మెల్యేను విద్యార్థినులు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజయుడు తిరిగి అలంపూర్‌కు వస్తున్నాడు. కర్నూలు జిల్లాకు నందవరం మండలం పులచింత గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ బీచుపల్లిలో కొత్త కారుకు పూజలు చేయించుకొని కర్నూల్ వైపు వెళ్తుండగా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్వల్పగాయాలు కావడంతో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారు ఆపి క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు చేయించి కర్నూల్ దవాఖానకు పంపించారు. ఎమ్మెల్యే విజయుడు రోడ్డు బాధితుడికి సాయం చేయడంతో వాహనదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా బాధితులకు సాయం చేసి వారి విలువైన ప్రాణాలను కాపాడాలని వాహనదారులకు ఎమ్మెల్యే సూచించారు.