అలంపూర్ ఏప్రిల్ 23: గద్వాల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, ఇంట్రా, వాటర్ గ్రిడ్ అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న కృష్ణ, తుంగభద్ర నదుల్లో ప్రస్తుతం నీటి నిల్వలు ఎంత మేర ఉన్నాయని, వాటి ద్వారా గ్రామాలకు వేసవిలో నీరు అందించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లు ఏంటని ఆరా తీశారు.
నదుల్లో నీటి నిల్వలు తగ్గే నేపథ్యంలో ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. డెడ్ స్టోరేజ్‌కి నీరు చేరుకున్న క్రమంలో ఆవి కలుషితమయ్యే అవకాశం ఉందని, ప్రత్యేక దృష్టి పెట్టి ఫిల్టరైజేషన్ పకడ్బందీగా చేయాలని సూచించారు. సాధారణ సమయంలో కూడా నీటి కష్టాలు ఎదుర్కొనే గ్రామాలు, ఈ వేసవిలో మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని, వాటి పై దృష్టి పెట్టి నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు.
ఇప్పటిదాకా అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలా అమలవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నీరు అందించటంలో నిర్లక్ష్యం చేయవద్దని, ఎలాంటి అవరోధాలు ఎదురైనా, అవసరాలు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ అధికారులు వెంకటరమణ, శ్రీధర్ రెడ్డి,పరమేశ్వరి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.