కాంగ్రెస్ పాలనలో రైతులు పంటపొలాల వద్ద కరెంట్ కోసం జాగారణ చేసేవాళ్లని, తెలంగాణ సర్కారు వచ్చాక నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కష్టాలన్నీ తొలగిపోయాయని నారాయణపేట, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, అబ్రహం పేర్కొన్నారు.నారాయణపేట జిల్లా పేరపళ్ల, కంసాన్పల్లి రైతువేదికల వద్ద ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి.., జోగుళాంబ గద్వాల జిల్లా లింగనవాయి రైతువేదికలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు అమావాస్య చీకట్లో బతికారని గుర్తు చేశారు. లోవోల్టేజీ సమస్యతో బోరు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పంటలు ఎండిపోయేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేన ని, వారి మాటలను నమ్మొద్దని సూచించారు.
నారాయణపేట, జూలై 20 : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో కేసులు వేస్తూ కాంగ్రెస్ కొట్టినట్లు చేస్తుండగా.. అనుమతులు ఇవ్వకుండా బీజేపీ తిట్టినట్లు వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలతో నాటకాలు ఆడుతున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. దామరగిద్ద మండలం కంసాన్పల్లి, నారాయణపేట మండలం పేరపళ్ల రైతువేదికల్లో గురువారం జరిగిన విద్యుత్‌పై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా రైతులకు మద్దతిచ్చేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3గంటల కరెంటే ఇస్తామంటున్నారు.. అది మీకు కావాలా? లేక 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ ప్రబుత్వం కావాలా? అని సమావేశానికి హాజరైన రైతులను ప్రశ్నించారు. దీంతో 3 గంటలు వద్దు.. 24 గంటలే ముద్దు అని రైతులంతా ముక్త కంఠంతో పలికారు.
గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతు చేయడానికి పదిరోజులు పట్టేదన్నారు. కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆ ఏడు పంట కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. కానీ నేడు కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి, 24గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్లనే మోటర్లు కాలిపోవడం లేదన్నారు. బోర్ల కాడ మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేసినా.. అవసరం అయితే గొంతు కోసుకుంటా తప్పా మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు, ఎరువులు, యూరియా కోసం పోలీస్స్టేషన్ల వద్ద లైన్లో నిలబడిన రోజులు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సమయానుకూలంగా అన్నీ సమకూరుస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతుబీమా అమలు చేశామన్నారు. జిల్లాలో 3వేలమంది రైతులు మరణిస్తే వారి నామినీల ఖాతాల్లో రూ.కోటి జమ చేసి బాధిత కుటుంబాలను ఆదుకున్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెసోళ్లు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మితే రైతులు గోస పడడం ఖాయమన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో 68లక్షల మెట్రిక్ టన్నుల పంటలే పండేవన్నారు. తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయ ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి నీటి వనరులు పెరిగాయన్నారు. సకాలంలో వర్షాలు కురవగా, 24గంటల విద్యుత్‌తో 2023 ఏడాదిలో ఏకంగా 2.70కోట్ల పంటలు పండాయన్నారు. నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. సాగుకు 3గంటల కరెంట్ చాలన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అంతవరకు ప్రజలు నిలదీస్తూనే ఉంటారన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భీమయ్యగౌడ్, దామరగిద్ద, నారాయణపేట ఎంపీపీలు నర్సప్ప, శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఈదప్ప, జెడ్పీటీసీ అంజలి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, దామరగిద్ద, నారాయణపేట వైస్ ఎంపీపీలు దామోదర్‌రెడ్డి, సుగుణ, ఎంపీటీసీ కిష్టప్ప, సర్పంచులు గురునాథ్‌గౌడ్, శ్రీదేవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, నాయకులు పాల్గొన్నారు.