భూత్పూర్, జూన్ 3 : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యం, సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో ఎంపిక చేసిన రైతులకు వరి, జొన్న, కంది నాణ్యమైన విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీని చేశారని తెలిపారు.
అదేవిధంగా రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచారని తెలిపారు. రైతులకు వరి ధాన్యానికి బోనస్ రూ.500 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల కంటే రేవంత్ రెడ్డి సర్కార్ రైతులపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏవోలు మురళీధర్, బ్యూల, అనిల్, వ్యవసాయ శాస్త్రవేత్త మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమ్య, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శెట్టి శేఖర్, శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, ఏఈవోలు ప్రసాద్ బాబు, శంకర్, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.