జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని, ప్రజలను మోసం చేసేందుకు ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో భాగంగా బుధవారం 120 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్హాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 55ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. పాలమూరును కరువు జిల్లాగా మార్చి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు.
ఇప్పుడొచ్చి మరోసారి అవకాశం ఇవ్వడంటూ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల స్టంట్‌గా ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీంలను తీసుకొచ్చిందని, ప్రజలు నమ్మితే నట్టేట ముంచుతారన్నారు. నాలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆరు గ్యారంటీ స్కీంలను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 80వేల కోట్లు ఖర్చు అయితే, రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడాన్ని చూస్తుంటే అందుకే పప్పు అంటారేమోనని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ సంపదను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి పెడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చినంక ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలబడాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామని, ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, తాసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.