మక్తల్ టౌన్, జనవరి 29 : పేదల చుట్టంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేరొందారు. నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతూ మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్షిశలు కృషి చేస్తున్నారు. 60 ఏండ్లు నిండిన నవ యువకుడిలా ప్రగతికి బాటలు వేస్తున్నాడు. అలుపెరగకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అనితర సాధ్యుడుగా గుర్తింపు పొందారు. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.
రాజకీయ ప్రస్థానం ఇలా..
మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, సుమిత్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానంలో 3వ సంతానం రామ్మోహన్‌రెడ్డి. 1963 జనవరి 30న ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ధన్వాడలో.. ఉన్నత విద్య రాష్ట్ర రాజధానిలో అభ్యసించారు. తర్వాత తండ్రితోపాటు రాజకీయాలను చూసుకుంటూ హైదరాబాదులో వ్యాపారాల్లో రాణిస్తున్నాడు. కాగా దురదృష్టకర పరిస్థితుల్లో తండ్రితోపాటు తమ్ముడు మరో 9 మందిని కోల్పోయిన చిట్టెం రామన్న ప్రజల ఆకాంక్షతో వ్యాపారాలను వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2005 డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. నాటి నుంచి నేటి వరకు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు. ఎన్నికైన మొదటి ప్రస్థానంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల్లో తనదైన ముద్రను చాటుకున్నాడు.
2009 తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓటమి చెందినా నిరాశ పడకుండా తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు చేరువయ్యాడు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. తర్వాత తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆర్షితులై గులాబీ పార్టీలో చేరారు. 2018లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. నాటి నుంచి నేటి వరకు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు. మక్తల్, అమరచింత, ఆత్మకూరును మున్సిపాలిటీలుగా మార్చాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సఫలీకృతులయ్యారు. ప్రత్యేక నిధులను తీసుకొచ్చి బల్దియాలను సుందరంగా తీర్చిదిద్దారు. టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఒక్కో మున్సిపాలిటీకి రూ.5 కోట్లను మంజూరు చేయించారు. రూ.2 కోట్లతో మక్తల్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తండ్రి కల నేరవేర్చిన తనయుడు
మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి కల అయిన భీమా ఫేస్-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయర్లను చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పూర్తి చేయించారు. దీంతో నియోజకవర్గంలో లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. నాడు బీళ్లుగా ఉన్న భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. వలసలు వెళ్లిన వారు సొంతూళ్లకు వచ్చి పండుగలా వ్యవసాయం చేస్తున్నారు. ఇంత మంచి పనులు చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని ప్రజలు, రైతులు పేర్కొంటున్నారు.