మదనాపురం, సెప్టెంబర్ 28 : సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే పేదల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మదనాపురం మండల కేంద్రానికి సంబంధించి అర్హులైన 136 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. అనంతరం డబుల్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండ్ల ఎంపిక ప్రక్రియ ప్రజల మధ్య పారదర్శకంగా చేపట్టినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ అంటేనే చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపితమైనదని అన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, మూడోసారి పట్టం కట్టాలని కోరారు. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మితే నట్టేట ముంచుతారన్నారు. వందల మంది తెలంగాణ బిడ్డలను బలితీసుకున్న కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తల్లీబిడ్డలను వేరు చేశారని తెలంగాణ రాష్ట్రంపై పదేపదే విషం కక్కుతున్న బీజేపీని ఇక్కడి ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, పనిచేసే వారికి ఓటేసి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించేందుకు అక్టోబర్ 4వ తేదీన మంత్రి హరీశ్‌రావు మదనాపురం మండల కేంద్రానికి వస్తున్నారని, భారీ సంఖ్యలో హాజరై మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు మండల నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మాజీ చైర్మన్ వెంకట్‌నారాయణ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రవీందర్‌రెడ్డి, తాసీల్దార్ అబ్రహం లింకన్, డీటీ అశోక్, సర్పంచ్ రాంనారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, మాజీ అధ్యక్షుడు రాములు, యూత్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.