కోడేరు, ఏప్రిల్ 9 : కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కృషితో సోమవారం నుంచి 10రోజులపాటు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. నియోజకవర్గంలోని రైతాంగం యాసంగిలో సాగుచేసిన వరిపంట చేతికొచ్చే దశలో ఉన్నది.
పంటకు ఒక తడి నీరు అవసరమున్నది. అయితే శ్రీశై లం బ్యాక్‌వాటర్ లేకపోవడం, రిజర్వాయర్లలో కూడా నీటినిల్వ లేక వారంరోజుల కిందట అధికారులు ఎంజీకేఎల్ఐ మోటర్లను నిలిపివేశారు. అలాగే కాలువల గేట్లు మూసివేశారు. దీంతో ఆందోళన చెందిన రైతులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ఆదివారం సాగునీటిశాఖ అధికారులతో సమావేశమై ఎంజీకేఎల్ఐ నీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. ఈ మేరకు 10రోజులపాటు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించారు.