మక్తల్ ,అక్టోబర్ 16 : పేద పిల్లలంటే సర్కారుకు ఎందుకు ఇంత చిన్నచూపని.. పురుగుల అన్నం తిని మా పిల్లలు చావాలా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 494 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బుధవారం మధ్యాహ్న భోజనం పెట్టగా, ఓ విద్యార్థి భోజనంలో పురుగు వచ్చింది. దీంతో సిబ్బంది గురువారం బియ్యం మార్చి వేరే బియ్యంతో మధ్యాహ్న భోజనం చేశారు. అయినప్పటికీ మళ్లీ భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తినలేక పారబోసి పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ పేద పిల్లలని ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా పురుగుల అన్నం పెట్టి మాకు కడుపుకోత పెడుతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా తలరాత బాగాలేకపోయినా మా పిల్లలైనా బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని సర్కారు బడికి పంపిస్తే నాణ్యత లేని భోజనం పెట్టి అనారోగ్యాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. భోజనంలో పురుగులు వచ్చిన విషయం తెలుసుకున్న తాసీల్దార్ సతీష్‌కుమార్ హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు పాఠశాలకు చేరుకొని బియ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సరఫరా చేసే బి య్యంలో పురుగులు అధికంగా ఉండడం వల్ల భోజనంలో పురుగులు వచ్చాయని, శుక్రవారం నుంచి నాణ్యమైన బి య్యంతో భోజనం వడ్డిస్తామని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎం, ఎంఈవోను ఆదేశించారు. కాగా, ఇంత జరిగినా విద్యార్థులకు తిరిగి భోజనాలు కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు పస్తులండాల్సి వ చ్చింది. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలోనే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉందని, సర్కారు బడులపై పట్టింపు లేకుండా వ్యవహరించడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు.