కొత్తకోట రూరల్, సెప్టెంబర్ 26 : కొత్తకోట మండల పరిధిలోని గుంపుగట్టు దగ్గర 20 ఎంఎల్డీ డబ్ల్యూటీపీలో వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సమ్మెకు పూనుకున్నారు. శుక్రవారం ఉదయం తాగు నీటి పరఫరాను బంద్ చేసి సమ్మెను ప్రారంభించామని తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అరుణ్‌కుమార్ తెలియజేశారు. ఈ విషయమై ఇదివరకే జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసీనట్లు వారు తెలిపారు. అదేవిధంగా పెండింగ్ వేతనాల విషయంపై మిషన్ భగీరథ జిల్లా ఎస్ఈ రమణ, డీఈ విజయ్‌కుమార్‌లకు రెండుమార్లు వినతిపత్రం అందజేసినా ఫలితం లేకుండా పో యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జీతాల పెండింగ్ విషయంలో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలుపగా సమ్మె విరమించి నెల రోజులు కావస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులు సమ్మె చేయడంతో స్పందించిన ఎస్ఈ, డీఈలు మిషన్ భగీరథ కార్మికుల వద్దకు చేరుకొని రెండు రోజులు గడువు ఇవ్వమని, అంతలోపు వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. రెండు రోజుల తర్వాత పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మిక సం ఘం ప్రధాన కార్యదర్శి శేఖర్, కురుమూర్తి, వెంకటేశ్, సాయికుమార్, సంతోష్, ఈశ్వరమ్మ, నిర్మలమ్మ, వంశీ, విన య్ తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల, సెప్టెంబర్ 26 : మిషన్ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని మిషన్ భగీరథ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోపల్‌దిన్నె మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట సీఐటీయూ కమిటీ ఆధ్వర్యం లో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఆరు నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నామని, ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు వేతనాలను సైతం పెంచాలని కోరారు. కార్మికుల నిరసన విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రాములు, డీఈ అమిత్‌కుమార్ చేరుకొని సమస్యలను పరిష్కరించడంతోపాటు పెండింగ్ వేతనాలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటియూ మం డల కన్వీనర్ ఆశన్న, కార్మికులు రాముడు, లోకనాయుడు, వెంకటయ్య, మహేశ్, రాఘవేంద్ర, రవి, నరేశ్, కురుమూర్తి పాల్గొన్నారు.