Kollapur | కొల్లాపూర్, ఫిబ్రవరి 14 : కొల్లాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయి. దీంతో బస్టాండ్ ఆవరణం మొత్తం బురదమయంగా మారింది.
శుక్రవారం కొల్లాపూర్ పట్టణానికి సింగోటం మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి తాగునీటిని విడుదల చేశారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీళ్లు మొత్తం బయటకు పారుతున్నాయి. దీంతో నీళ్లు వదిలిన ప్రతిసారి నీళ్లు వృథాగా రోడ్డుపై పారుతుండడంతో బస్టాండ్లో ప్రయాణికులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక బురద నీళ్లు పైప్ లైన్లో కలిసి కలుషితం అవుతున్నాయి. అవే నీళ్లను పట్టణ ప్రజలు తాగే పరిస్థితి ఏర్పడింది.
సింగోటం నుంచి కొల్లాపూర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుండి కొల్లాపూర్ పట్టణానికి వచ్చే మార్గమధ్యంలో పైప్ లైన్లు డామేజ్ అయినా ప్రతిసారి కొల్లాపూర్ పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా ఎల్లూరు మిషన్ భగీరథ నుంచి కొల్లాపూర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎల్లూరు నుంచి కొల్లాపూర్ పట్టణానికి మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ వేస్తే తాగునీటి సమస్యను కొంతమేరకు అరికట్టడంతో పాటు సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతులు చేసేందుకు సమయం తక్కువగా పడుతుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వెంటనే మిషన్ భగీరథ లీకేజీని అరికట్టాలని మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు.