హన్వాడ, జూన్ 17 : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని యేనెమీదితండాలో గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా రూ.10లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ భవనానికి భూమిపూజ చేసి రూ.10లక్షలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో నేడు తండాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచాయన్నారు. మండలంలో 11 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. జనాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10శాతానికి పెంచారని గుర్తుచేశారు. త్వరలోనే గిరిజనులకు పోడు భూమి పట్టాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మండలంలోని ప్రతి చెరువును కాల్వల ద్వారా నింపుతామన్నారు. కులాల పేరుతో ఓట్ల కోసం గ్రామాలకు కొందరు రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాని కోరారు. బీజేపి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలయ్యే ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని విమర్శించారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇక్కడి పథకాలనే కేంద్రం కాపీ కొడుతున్నదన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజయ్యగౌడ్, నాయకులు రమణారెడ్డి, కొండా లక్ష్మయ్య, జంబులయ్య, హరిచందర్, పెంట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.