మక్తల్ : కృష్ణానది ఉరకలేస్తుండగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్న రెండు రిజర్వాయర్లను నింపడంలో మంత్రి వాకిటి శ్రీహరి( Minister Vakiti Srihari) నిర్లక్ష్య వైఖరిని వీడి ప్రాజెక్టుల ( Projects ) ద్వారా సాగుకు నీటి విడుదల చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Former MLA Chittem ) డిమాండ్ చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కృష్ణా నదికి వరద వచ్చి నెల గడుస్తున్నప్పటికీ, ప్రాజెక్టులను కృష్ణా వరద నీటితో నింపేందుకు చర్యలు వేగవంతం చేయకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బండ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాలువలకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయక చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులు సాగునీరు అందుతుందా లేదా అనే అయోమయంలో ఉన్నారని అన్నారు. మంత్రి ఇరిగేషన్ శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకోవడంతోపాటు, శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రైతాంగానికి సాగునీటిని విడుదల చేయడంలో దృష్టి సారించాలని సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటి కష్టాలు దూరం..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా ఎప్పటికప్పుడు పంటల సాగు కోసం రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేసేవారని వెల్లడించారు . స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాకుండా కేసీఆర్ ప్రభుత్వం అందించిన రూ. 6వేలను జమ చేస్తుందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ కు రైతన్నలకు కావలసిన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలన్నారు.
మంత్రి స్పందించి సంగం బండా రిజర్వాయర్ లెఫ్ట్, రైట్ కెనాల్స్ నుంచి నీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మక్తల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, నాయకులు అన్వర్ హుస్సేన్, జట్ల శంకర్, మైముద్, మన్నన్, మంగలి నరసింహ, తిర్లాపురం కృష్ణ యాదవ్,కుమార్,శివారెడ్డి,నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.