వనపర్తి, జూలై 31 (నమస్తే తెలంగాణ): మోడీ ప్రభు త్వ హయాంలో సామాన్యులకు చేసిందేమిటో ఒక్కటి చెప్పాలని, బ్యాంకులను ముంచి దేశాన్ని వదిలిపోయిన కార్పొరేట్ గద్దల రూ.6లక్షల కోట్లను మాఫీ చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీకీ ఓటేస్తే రైతులు ఉరేసుకునే పరిస్థితి వస్తుందని, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి విమర్శించారు. ఆదివారం మదనాపురం మండలం దంతనూర్లో గోదాం, దుకాణా సముదాయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు విజయవంతమై ప్రజల్లో ప్రఖ్యాతులు వస్తుంటే ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్లో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ వంటి సం క్షేమ కార్యక్రమాలు లేవన్నారు. ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదన్నారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ అందిస్తే కేంద్రానికి ఎందుకు కళ్లమంట అని ప్రశ్నించారు. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేనాటికి వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.385 ఉండగా ప్రస్తుతం అది రూ.1180కు చేరింది నిజం కాదా అని ప్రశ్నించారు.
ఒక్క సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలను 82శాతం పెంచారన్నారు. జీఎస్టీ పెట్టి రాష్ర్టాల ఆదాయం కొల్లగొడుతున్నారని విమర్శించారు. పాలు, పెరుగుపై పన్నులు విధించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని , అధికారంలోకి వస్తే తాము చేస్తామని హామీ ఇచ్చి ప్రధాని మోదీ ఇప్పటి వరకు అమలు చేయలేనందుకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ట్యాక్సులు వేసి సామాన్యుల బ్రతుకులను ఛిద్రం చేసిన నరేంద్రమోడీ …అవసరమైతే తలమీద వెంట్రుకలకు కూడా పన్ను వేసే అవకాశముందని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యాపా రం తప్పా వ్యవసాయం తెలియదన్నారు. దేశంలో 18రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 75ఏండ్లు దేశాన్ని పాలించిందని, అధికారంలో ఉన్న రాష్ర్టాలను కూడా కాంగ్రెస్ చేజార్చుకుంటుందన్నారు. మోడీపై పోరాటం చేయడానికి రాహుల్‌గాంధీ వణికిపోతున్నాడని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసేవేనని విమర్శించారు.
రిజిస్ట్రేషన్లలో వనపర్తి జిల్లా టాప్
35లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న పాలమూరుకు కేవలం లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే జూరాల ప్రాజెక్టును నాలుగు దశాబ్ధాల పాటు సాగదీశారన్నారు. కేవలం మూడేండ్లలో గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మొదలు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నిర్మించిన శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు చాలాసార్లు మునిగాయన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంపుహౌస్ మునిగిపోతే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లలో వనపర్తి జిల్లా ముందుందని, ఇది ప్రజల జీవన ప్రమాణాలు పెరుగాయయనడానికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ రంగానికి చేయూత మూలంగా కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే కొనలేమని మోడీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఉచితాలు ఎత్తివేయాలని మోడీ చెబుతున్నారని, సబ్సిడీలు ఎత్తివేస్తే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. దేశంలో రెండు పూటల తిండిలేని వారు 22కోట్ల మంది ఉన్నారని వీరికి తిండి పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. బియ్యం కొనుగోలు చేసి వారికి తిండిగింజలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ లేకుంటే ప్రత్యేక తెలంగాణే లేదని, ఇంతటి అభివృద్ధి సాధ్యపడేది కాదన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. లబ్ధిదారులందరూ కేసీఆర్ వెంటే నడువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, నూతన మార్కెట్ యార్డు చైర్మన్ మూలమల్ల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైస్‌చైర్మన్ యాదగిరి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, కొత్తకోట సింగిల్ విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ కొట్టం వంశీధర్‌రెడ్డి, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక పాల్గొన్నారు.
వనపర్తిరూరల్, జూలై 31: ప్రతి పల్లెలోనూ కుటీర పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధిదారులు మందుకు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దగూడెంలో ఆదివారం అవర్‌ఫుడ్ ఆధ్వర్యంలో రైతు ఫ్రాంచైజీ నుంచి ఏర్పాటు చేసిన వేరుశనగ మినీ మిల్లును మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో రైతులు పండించే పంటలను ప్రాసెసింగ్ చేసుకునేందుకు రైతులే సొంతంగా యూనిట్లు పెట్టుకునేందుకు అవర్ ఫుడ్ వారు ముందుకు రావడం సంతోషమన్నారు. రాష్ట్రంలో సాగునీటి రాకతో పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. ఆహార రంగంలో నాణ్యమైన ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. అందుకు తగ్గట్లుగా ఉత్పత్తులను తయారు చేయాల్సిన బాధ్యత యూనిట్ నిర్వాహకులదేనన్నారు. డిమాండ్‌కు తగ్గ పంటలను వేసేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు. వేరుశనగ, కంది, పప్పుశనగ సాగుకు ఉమ్మడి జిల్లా ప్రసిద్ధి చెందిందన్నారు. అంతకుముందుకు తెలంగాణ అవర్‌ఫుడ్ రైతు ఫ్రాంచైజీ అధికారి అజయ్ మంత్రికి వివరిస్తూ రైతులకు ఎస్బీఐ బ్యాంకు నుంచి 35శాతం సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండన్న, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మధుబాబు, అదనపు డీఆర్డీవో రేణుక,మహిళా సమాఖ్య సభ్యురాలు అలివేలమ్మ, శాంత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, యూత్ మండల కార్యదర్శి గణేశ్, గ్రామ యూత్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ కొలమయ్య, లక్ష్మీకాంత్‌రెడ్డి, లాలయ్య, బుచ్చిబాబు, హలీం, వెంకటయ్య పాల్గొన్నారు.