వెల్దండ ఏప్రిల్ 7: చదువుల తల్లికి పేదరికం అడ్డొచ్చింది. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి సర్కార్ బడుల్లోనే చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా.. మెడికల్ కళాశాలలో ఫీజు కట్టడానికి డబ్బులు లేక అయోమయంలో పడింది. దాతలు తనకు సహకారం అందించాలని వేడుకుంటున్నది.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి కొమ్ము సింధూర తండ్రి వెంకటయ్య స్థానికంగా ఓ కంపెనీలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. సింధూర పదో తరగతి వరకు రాచూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా గవులిదొడ్డి గురుకుల పాఠశాలలో 923మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించింది. నీట్లో 451 ర్యాంక్ రావడంతో కౌన్సెలింగ్లో మహబూబ్నగర్ ఎస్వీఎస్ వైద్య కళాశాలలో సీటు లభించింది.
మొదటిఏడాది కళాశాల ఫీజుకు రూ.60వేలు, హాస్టల్ ఫీజు రూ.లక్షతో పాటు ఇతర ఖర్చులు అప్పు చేసి చెల్లించారు. కోర్సు పూర్తి చేయడానికి డబ్బులు లేవని దాతలు ఆదుకొని తన చదువు పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరుతున్నది. పేదలకు సేవలందించడమే లక్ష్యంగా వైద్య వృత్తిని ఎంచుకున్నట్లు చెబుతున్నది.
సింధూర పైచదువులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని స్థానికులు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు తెలియజేశారు. స్పందించిన మంత్రి ఆమె వైద్య విద్యకు సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సింధూర చదివే మెడికల్ కళాశాల వివరాలను సేకరించాలని కేటీఆర్ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.