Jupalli Krishna Rao | కొల్లాపూర్, ఫిబ్రవరి 12: ప్రముఖ పర్యాటక క్షేత్రమైన సోమశిలలో బుధవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. సోమశిలలో భక్తుల విడిది కోసం నూతనంగా నిర్మిస్తున్న షెడ్లను, డార్మిటరీ గదులను వారు పర్యవేక్షించారు. టూరిజం క్రూయిజ్ లాంచీలో మల్లేశ్వరం ఐల్యాండ్, అమరగిరి ఐ ల్యాండ్లను పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించడానికి కాటేజ్‌లను నిర్మించడానికి కృషి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. టూరిస్ట్‌లు ఇక నుంచి సోమశిల – శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని ప్రతి రోజు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ, నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.