కొల్లాపూర్, ఆగస్టు 5 : నల్లమల అందాల మధ్య కృష్ణానది అలల సవ్వడితో ఆధ్యాత్మికం, పర్యాటకం కలబోతగా ఉన్న కొల్లాపూర్ ప్రకృతి అందాలను ప్రపంచానికి తెలియజేసేందుకు పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ సంతోష్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో మొ క్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంసరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు.
ప్రజలు తమ ఇంటి పరిసరాలతోపాటు గ్రామ, పట్టణాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి జూపల్లి, కలెక్టర్ సంతోష్ కష్ణమ్మకు పూజలు చేసి హారతినిచ్చారు. అంతముందు సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల వద్ద పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు చేపట్టాల్సిన పనులపై ప్రణాళికల రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు
కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. పెంట్లవెల్లి కేజీబీవీలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను మంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్హాల్లో కేజీబీవీ విద్యార్థినులు, బోధన, బోధనేతర సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి పాల్గొని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించే నిధులను పాఠశాలలు, హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాల కోసం కేటాయిస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.