బిజినేపల్లి : వరి కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు కూడా లేవని సీపీఎం( CPM ) జిల్లా కమిటీ సభ్యులు అశోక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వరి రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు ( Paddy Purchase Centers ) చేస్తున్నా , సకాలంలో బస్తాలను ఇవ్వడంలేదని విమర్శించారు.
సంచి బరువు పేరుతో ఒక బస్తాకు కిలో తరుగు తీస్తున్నారని ఆరోపించారు. కొద్దిగా పచ్చిగా ఉన్న నాలుగు, ఐదు కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధాన్యం నింపడానికి సంచులు ఇచ్చినా వాటిని తీసుకెళ్లేందుకు మూడు ,నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు. అంతవరకు వర్షం వచ్చినా, ఏం జరిగినా రైతులే బాధ్యత వహించాలని చెబుతున్నారని అన్నారు.
రైతులకు వెంటనే ధాన్యం తడవకుండా కప్పేందుకు కవర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు చంద్రశేఖర్, హనుమంతు,రాములు,సుధాకర్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.