మూసాపేట(అడ్డాకుల) : అడ్డాకుల మండల పొన్నకల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు ( Grain purchase) కేంద్రాన్ని కలెక్టర్( Collector) విజయేందిర బోయి (Vijayendira Boi ) శుక్రవారం తనిఖీ చేశారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు వేసవిలో ఇబ్బంది లేకుండా త్రాగు నీరు, నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీలు సరిపడా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గన్నీలు అవసరమైన మేరకు పౌర సరఫరాల సంస్థ నుంచి సరిపడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతులతో ఆమె మాట్లాడారు. ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని, సన్న ధాన్యానికి అదనంగా క్వింటాలుకు రూ. 500 లు బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఇసుక, మట్టి బెడ్డలు, సేంద్రీయ పదార్థాలు, పొట్టు, తాలు గింజలు వంటివి లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొన్నేకల్ గ్రామంలో ఇసుక రీచ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఇసుక రీచ్ నుండి ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా మన ఇసుక వాహనం ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేయాలని సూచించారు.