నారాయణపేట, జూలై 5 : రాష్ట్రంలో మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో నారాయణపేటకు అవకాశం లభించడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఎంఎస్ నంబర్ 81 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న జిల్లా దవాఖానను మెడికల్ కళాశాలకు అనుబంధం చేస్తూ జీవోలో పేర్కొంది.
నారాయణపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేట రూపురేఖలే మారనున్నాయి. మెడికల్ కళాశాల ఏర్పాటు జిల్లా దవాఖానకు కూడా ఉపయోగపడనున్నది. అదేవిధంగా జిల్లాకు చెందిన విద్యార్థులు స్థానిక కళాశాలలోనే మెడిసిన్ చేసే అవకాశం లభించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభంకానున్నాయి. వైద్య రంగాన్ని పటిష్టం చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్ చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది.
మెరుగుపడనున్న వైద్య సేవలు..
పేట జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. పేట జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు
ఇచ్చిన మాట ప్రకారం జోగుళాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వ దవాఖాన భవనాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ అవసరమైన వైద్య సామగ్రి కొనుగోలుకు అనుమతులు వచ్చాయి. మెడికల్ కళాశాల, ప్రస్తుత ప్రభుత్వ జిల్లా దవాఖాన భవనాలు, రహదారుల నిర్మాణాన్ని టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
– వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కళాశాల మంజూరు అభినందనీయం
స్థానికంగా మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులు, రోగులు మహబూబ్‌నగర్‌కు వెళ్లే పని తగ్గింది. అంతేకాకుండా ఫార్మసీ సంబంధిత వ్యాపారులు కూడా ఆర్థిక పరిపుష్టి పొందుతారు. పేట మున్సిపాలిటీని మరింత విస్తరించడానికి ఇదొక మంచి అవకాశం.
– సుదర్శన్‌రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్, నారాయణపేట