నాగర్‌కర్నూల్ రూరల్, అక్టోబర్ 10 : ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో గురువారం కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు కాక బాకీ ఉన్న డబ్బులను బాకీకార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పిం చేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని నాగర్‌కర్నూల్ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా చేపడుతామన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 22నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడంలేదని దెప్పి పొడిచారు.
ప్రతి మహిళకు రూ.2500 చొప్పున 22 నెలలకు రూ.55,000రూ.లు, వృద్ధులు, ఇతర పింఛన్‌దారులకు రూ.44,000, రైతు భరోసా రూ.15,000 చొప్పున, రైతులకు- కౌలు రైతులకు రూ.14 నుంచి 19 వేలు, రుణమాఫీ రూ.2,00,000 బాకీ పడింది. విద్యాభరోసా రూ.5లక్షలు ఇస్తామన్నారు ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు రూ.12,000 చొప్పున రెండేండ్లకు రూ24,000, ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.8వేల కోట్లు బాకీ పడిందని రెండేళ్లలో ఎవరికీ ఎంత మేర ప్రభుత్వం బాకీ పడిందో ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.