కొల్లాపూర్ మామిడికి దేశ, విదేశాల్లోనూ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. పండ్లల్లో రారాజు అయిన మామిడి ఈ ఏడాది చిన్నబోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిటశాపంగా మారింది. దీంతో మా మిడి దిగుబడి తగ్గిపోవడంతో తెచ్చిన అప్పులు మీదపడుతున్నాయని మదనపడుతూ తనువు చాలిస్తున్న రైతుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో మా మిడి సాగు చేస్తున్న సీఎం సొంత జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వచ్చిన దిగుబడిని కూడా దళారులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం మామిడి రైతులను సంక్షోభం బయటపడేసేందుకు మార్గాలను అన్వేషించడం లేదు. గత ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ఎగుమతులను ప్రోత్సహించేది. దీంతో దిగుబడి తక్కువగా వచ్చినా మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించేది. కానీ ఈ ఏడాది ప్రభుత్వం మామిడి రైతుల ఇబ్బందులపై దృష్టి పెట్టలేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది మామిడి పంట దిగుబడి భా రీగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తే ఈ ఏడాది ఒక్కటి నుంచి రెండు టన్నుల మ ధ్య దిగుబడి కుదించుకపోయింది. జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూ రు, లింగాల, పదర, ఉప్పునుంతల పరిధిలో 2311.53 ఎకరాలు, కల్వకుర్తి, చారగొండ, వంగూరు, ఉర్కొండ, వెల్దండ పరిధిలో 4818.07 ఎకరాలు, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెలక్కపల్లి, తిమ్మాజిపేటల పరిధిలో 2922. 98 ఎకరాలు, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల పరిధిలో 23789. 33 ఎకరాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా 33841.91 ఎకరాల్లో మామిడి తోటలను సా గు చేస్తున్నారు. సగటున 90 మె ట్రిక్ టన్ను లు దిగుబడి వస్తున్న మామిడి పంట ఈ ఏడాదికి 40 నుంచి 50 మెట్రిక్ టన్నుల దిగుబడి పడిపోవచ్చున్నని ఉద్యానవన అధికారులు అం చనా వేస్తున్నారు.
వాతావరణంలో వచ్చిన అసాధారణ మా ర్పులు మామిడి రైతులను కుంగదీశాయి. సా ధారణంగా మామిడి తోటలకు అనువుగా వా తావరణం ఉండాలంటే ఉష్ణోగ్రతలు 25 నుం చి 32 లోపు ఉండాలి. కానీ ఈ ఏడాది ప్రా రంభం నుంచే 37 నుంచి 39 డిగ్రీల వ రకు రావడంతో మామిడి తోటలను భారీగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. అంతేకాదు పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో పాటు పగటిపూట పొగ మంచు అధికంగా ఉండడంతో పూత సమయంలో తామర పురుగు ప్రభావం అధికం కావడంతో పూత రాలిపోయింది. కొత్తగా ఆకులు చిగురించి పూత రాలిపోతోం ది. అధిక ఉష్ణోగ్రతల మూలంగా తేనె మంచు కూడా దిగుబడి తగ్గేందుకు కారణమై అయిందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మామిడి కాత భారీగా తగ్గిపోవడంతో మామిడి ధర కూడా కొండెక్కింది. 20 కిలోల బాక్స్ ధర రూ. 2500, నుంచి రూ.5వేల వరకు మార్కెట్ పలుకుతోంది. ఈ ఏడాది సామాన్యులకు మామిడి పండ్ల రుచి మరింత ప్రియంగా మారనున్నది. అయితే మామిడి రైతుల కంటే దళాలరులు ఎక్కువ లాభం పొందుతున్నారు. మార్కెట్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు రింగుగా మారి రైతులను మోసం చేస్తున్నారు. దీంతో మామిడి పండ్లను అమ్మపోతే అడవిగా కోనబోతే కొరివిగా మారింది.
సీఎం సొంత జిల్లా అధికంగా సాగు అయ్యే మామిడి దిగుబడి తగ్గిపోవడానికి వాతావరణ వ్యత్యాసంతోపాటు ప్రభుత్వ విధానాలు కూడా ఓ విధంగా కారణం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణామాఫీ చేయకపోవడం, రైతుబంధు పూర్తి స్థాయిలో వేయకపోవడంతో రై తులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని మామిడి తోటలపై పెట్టుబడి పెట్టారు. మామిడి తోటల్లో పూత నిలుపుకొనేందుకు ఒక్కో రైతు దాదాపు పదుల సార్లు స్ప్రే చేశారు. ఫర్టిలైజర్ ఖర్చులు, పొలం దున్నే ఖర్చులు, కూలీల ఖర్చులకు తోడు ముందస్తుగా కౌలు చెల్లించడంతో సగటున ఎకరా మామిడి తోటకు రూ.లక్ష నుంచి రెండు లక్షల దాకా ఖర్చు చేశారు.
దీంతో దిగుబడి వచ్చిన రైతు అరకొర సం తోషంగా ఉంటే దిగుబడి లేని రైతు అప్పుల ఊబీలోకి పడిపోతున్నా రు. పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మాలపూర్ గ్రామానికి చెందిన రైతు కోనమోని శ్రీనివాసులు కల్వకుర్తి మండల పరిధిలో మామిడి తోటను కౌలు తీసుకున్నాడు. మామిడి తోటలో పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేనని గత శుక్రవారం ఆత్మహత్య చేసుకు న్న ఘటన విధితమే. ప్రభుత్వం మొద్దు నిద్ర లేవాలని రైతు సంఘా ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ముక్కిడిగుండం శివారులో ఎనిమిది ఎకరాల మామిడి తోటను కౌలు తీసుకున్నాను. 16 ఏండ్ల వయస్సు వున్న 245 చెట్లు వున్నాయి. తోట యాజమానికి ఇప్పటికే రూ. రెండు లక్షల యాభైవేలు చెల్లించాను. మూడు లక్షల దాక అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పటి ఎనిమిది సార్లు మందులు తెచ్చి స్ప్రే చేసినా పూత నిలవడం లేదు. కానీ తోటలో కాయలు కనబడటం లేదు. తోట చూస్తుంటే గుండె బరువెక్కి పోతున్నది.
ఈ ఏడాది వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి. దీంతో తామర ఉధృత్తి పెరగడంతో పూత పిందెగా మారడంలో తగ్గుదల కనబడింది. అలాగే తేనె మంచుకు కూ డా ఈ ఏడాది అధికంగా ఉంది. వా తావరణ వ్యత్యాసం మామిడి దిగుబడికి కారణంగా చెప్పవచ్చు.
– లక్ష్మణ్, ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి
మామిడి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నది. సీఎం సొంత జిల్లాతో పాటు, స్థానిక మంత్రి సొంత నియోజకవర్గంలో అత్యధికంగా మామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో నేను సీఎం వద్ద ప్రత్యేక చొరువ తీసుకొని కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వానికి నాకు పేరు వస్తోందని ఈ ప్రాంత మామిడి రైతుల ఉసురు తీస్తున్నారు. సకాలంలో రైతులకు రుణమాఫీ చేయకుండా రైతు బంధు ఇవ్వకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టి వేశారు. ప్రభుత్వం వెంటనే మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్