మాగనూరు, మార్చి 27 : మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల కిందట జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్రసంగం చేస్తే మక్తల్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మాగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గలు ప్రజలు మీ పరిపాలనను 15 నెలల నుంచి గమనిస్తున్నారన్నారు.
మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్ జరిగిన రెండో రోజు కూడా విద్యార్థులకు వండిన అన్నంలో పురుగులు రావడం వల్ల, విద్యార్థులకు పురుగుల అన్నం పెడితే మళ్లీ విద్యార్థులు అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి వస్తుందని నేపథ్యంతో, ఆ ఆహారం చల్లించి, సొంత డబ్బులతో బియ్యం తెప్పించి విద్యార్థులకు ఆహారం పెట్టిస్తే ఓ ర్చుకోలేని ఎమ్మెల్యే, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబు తూ సభలోని సభ్యులను పకదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలోనే మక్తల్ కోర్టు, నూతన దవాఖాన భవనం, ఫైర్ స్టేషన్, సంగంబండ లెఫ్ట్‌లో లెవె ల్ కెనాల్ కాల్వ బండ పగలగొట్టడానికి కూడా నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులకు ఆడంబరాలతో మళ్లీ భూమి పూజలు చేశారు తప్పా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చేసింది ఏమిటో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు సాగునీరుకు, తాగునీరుకు, కరెంటు కోతలతో ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎప్పుడైనా గమనించారా, ఎకడైనా పరిశీలించారా అని ప్రశ్నించారు.
సంగంబండ రిజర్వాయర్‌లో సాగునీరు ఉన్నా రైతులకు సక్రమంగా సాగునీరు అందించలేని విధంగా మీ పాలనలో కొనసాగుతుందని మండిపడ్డారు. ఇరిగేషన్‌శాఖ మంత్రి ఒక అవగాహన లేదని, అలాంటి మంత్రికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని, రైతుల కష్టా లు పట్టించుకునే నాథుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేడని వాపోయారు. రైతుల కష్టాలు తెలుసుకున్నది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజు కూడా రైతులు సాగునీటికి ఇబ్బందులు పడిన దాఖలాలు లేవని వివరించారు. సమావేశంలో మాగనూరు పీఏసీసీఎస్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, పూల రాములు, పల్లె మారెప్ప, బసంత్‌రెడ్డి, సుల్తాన్, డీజిల్ సబెన్న, అలీ పాల్గొన్నారు.