మహబుబ్నగర్ జిల్లా : కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత మౌనిక ముదిరాజ్, అశోక్ కుమార్ ముదిరాజ్ దంపతులు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ను వీడారు. 19వ వార్డుకు చెందిన మరికొంతమంది ముఖ్య నాయకులతో కలిసి వారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో అధికారికంగా నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ మార్గాల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అందుకోసం ఎన్నికల కోడ్ను సైతం ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు భయాందోళనలు సృష్టిస్తున్నారని, అయితే పట్టణ ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై వార్డుల్లో ప్రజలు నిలదీస్తుంటే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారని, సొంత పార్టీ నేతలే అక్కడి పరిస్థితులపై వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కీలక నేతల వలసలతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడిందని, కొల్లాపూర్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.