
కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు దృష్టి సారించాలి
ధాన్యం కేంద్రాలను తనిఖీ చేయాలి
వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు
కరోనా నియంత్రణకు ప్రభుత్వం కృషి
టెలీకాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 25 : రైతులు కేంద్రాలకు ధా న్యం తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ తరుగుతీస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వైద్యాధికారులు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాక మిల్లుల వద్ద ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటప్పుడు క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద కొనుగోళ్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండేలా చూడాలన్నారు. కరోనా నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కొవిడ్ కన్న కరోనా వార్తల ప్రచారం ప్రమాదకరంగా ఉందన్నారు.
కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చని, పాజిటివ్ వచ్చిందనగానే భయపడొద్దన్నారు. తెలంగాణలో వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్పదన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే వారు టీకా కోసం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించరని వివరించారు. సామూహిక కార్యక్రమాలు నిర్వహించొద్దని, శుభకార్యాలను ప్రజలు వాయిదా వేసుకోవాలని లేదా పరిమితంగా నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద సాగునీటి కాల్వలన్నింటిలో పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు.
రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి
రెండు నెలలపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆదివారం వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. కరోనా పరీక్షలు చేయడం, టీకా లు వేయడం, ఇతర అన్ని విషయాల్లో రాష్ట్రం ముందంజలో ఉన్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు మనకన్నా ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అందరికీ టీకా ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఒక యుద్ధంగా భావించి టీకా వేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో సామూహిక పండుగలు జరుపొద్దన్నారు. కుటుంబ శుభకార్యాలన్నీ పరిమితంగా చేసుకోవాలని సూచించారు.