Karthi New Movie | తమిళ స్టార్ నటుడు కార్తి, కృతిశెట్టి జంటగా నటించిన క్రేజీ మాస్ ఎంటర్టైనర్ ‘అన్నగారు వస్తారు’ (తమిళంలో వా వాతియార్) ఎట్టకేలకు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో జనవరి 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది.
ఈ సినిమా కథాంశం విషయానికొస్తే, లెజెండరీ నటుడు ఎంజీఆర్‌కు వీరాభిమాని అయిన తాత (రాజ్‌కిరణ్), తన మనవడు రామేశ్వరన్ (కార్తి)ని కూడా ఎంజీఆర్‌లాగే అత్యంత నిజాయతీపరుడిగా చూడాలని కోరుకుంటాడు. తాత ఆశయం మేరకు పోలీస్ అధికారి అయిన రామేశ్వరన్, లోలోపల మాత్రం తాత అంచనాలకు భిన్నంగా లంచగొండిగా, అవినీతిపరుడిగా తయారవుతాడు. ఒకానొక సందర్భంలో తాతకు మనవడి అసలు రంగు తెలియడం, ఆ బాధతో ఆయన కన్నుమూయడం సినిమాను మలుపు తిప్పుతుంది. తాత మరణం తర్వాత ఆ అపరాధ భావంతో రామేశ్వరన్ తనను తాను ఎలా మార్చుకున్నాడు, ఒక నిజాయతీ గల ఆఫీసర్‌గా ఎలా ఎదిగాడు అన్నదే ఈ సినిమా కథ.