Anasuya | టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు గత కొంతకాలంగా తెగ వార్తల్లో వినిపిస్తోంది. నటుడు శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం, దానికి అనసూయ ఇచ్చిన కౌంటర్, ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్… ఇవన్నీ కలిసి ఈ అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే తాజాగా మరో సంచలన ప్రకటన తెరపైకి వచ్చింది. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడినని చెప్పుకుంటున్న మురళీ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అనసూయకు మద్దతుగా గతంలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పటికే వైరల్ కాగా, తాజాగా వరుస ఇంటర్వ్యూలతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ శర్మ మాట్లాడుతూ, తమిళనాడులో నటి ఖుష్బూకు, అలాగే సమంతకు గుడులు ఉన్న ఉదాహరణలను ప్రస్తావించారు. అదే తరహాలో యాంకర్ అనసూయకు కూడా ఆలయం నిర్మించాలన్నది అభిమానుల ఆకాంక్షగా పేర్కొన్నారు. అభిమానులంతా కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎక్కడ ఆలయం నిర్మించాలనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే ఇది పూర్తిగా అనసూయ అంగీకారంపైనే ఆధారపడి ఉంటుందని మురళీ శర్మ స్పష్టం చేశారు. ఆమె అనుమతి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం లభిస్తేనే ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. అనసూయపై తనకు అపారమైన గౌరవం ఉందని, ఇటీవల ఆమె ఇచ్చిన కౌంటర్‌కు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఆలయం విషయంలోనూ ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. “అక్కడ ప్రత్యేకంగా పూజారులు అవసరం లేదు. ప్రేమతో ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు” అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఈ ప్రకటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది అభిమానులు మురళీ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం సెలబ్రిటీలకు గుడులు కట్టడంపై సెటైర్లు వేస్తున్నారు. “నిజంగానే గుడి కడతారా?”, “ఎక్కడ కడతారు?”, “ఎప్పుడు మొదలుపెడతారు?” అంటూ ప్రశ్నలతో సోషల్ మీడియా ఆసక్తిగా మారింది. మొత్తానికి, అనసూయ పేరు చుట్టూ నడుస్తున్న ఈ తాజా చర్చ మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై అనసూయ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.