Indian Railways | రైలు ఆలస్యంతో ఓ విద్యార్థి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో న్యాయస్థానం తాజాగా కీలక తీర్పు వెలువరించింది. సదరు విద్యార్థినికి రైల్వే శాఖ నుంచి రూ.9 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ భారతీయ రైల్వేను ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ బస్తీ (Basti) జిల్లాకు చెందిన సమృద్ధి (Samruddhi) అనే విద్యార్థిని 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు లక్నోలోని జై నారాయణ్ పీజీ కళాశాల సెంటర్ పడింది. దీంతో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఆమె ‘ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కింది. కానీ, ఆ రైలు నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకుంది. దీంతో సమృద్ధి టైమ్‌కి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయింది. ఫలితంగా ఆమె ఓ అకాడమిక్ ఇయర్‌ను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని రైల్వే శాఖపై న్యాయపోరాటానికి దిగింది. జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.
దాదాపు ఏడు సంవత్సరాలుగా జరిగిన న్యాయ పోరాటం తర్వాత.. కమిషన్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ లోపాలకు రైల్వే శాఖే బాధ్యత వహించాలని తీర్పు చెప్పింది. విద్యార్థిని కోల్పోయిన విద్యా సంవత్సరానికి గానూ పరిహారంగా రూ.9 లక్షలు, కేసు ఖర్చుల నిమిత్తం రూ.12 వేలు చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది.
Also Read..
Viral Video | సిగరెట్ లైటర్ కోసం గొడవ.. ఫ్రెండ్‌ను కారుతో గుద్ది హతమార్చిన వ్యక్తి
Snowfall | హిమాచల్‌లో తీవ్రమైన మంచు.. వెయ్యికిపైగా రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు
Money Heist Case | రెండు కంటెయినర్లతో రూ.400 కోట్లు మాయం?.. 3 నెలల తర్వాత వెలుగులోకి