ప్రజా ఆశీర్వాదం బలంగా ఉండడంతో రానున్న ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని పాలకొండ నుంచి బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్న దన్నారు. స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టో ప్రజామోదంగా ఉండడంతో గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు ప్రచార అస్ర్తాలన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్,అక్టోబర్ 25: మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో లక్ష ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం పాలకొండలోని ఆంజనేయస్వామి ఆలయం, షాసాబ్‌గుట్ట దర్గా, కల్వరి ఎంబీ చర్చిలో కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్, షాసాబ్‌గుట్ట దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్జ్రాక్షా ఖాద్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మంత్రిని ఆశీర్వాదించారు. మహబూబ్‌నగర్ నియోజవర్గ అభివృద్ధి వివరిస్తూ మంత్రి కుటుంబ సమేతంగా పాల్కొండలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. పాలకొండ చౌరస్తాలో ప్రచార రథం నుంచి మంత్రి ప్రసగించారు. గతంలో తాగునీటి కోసం మహబూబ్‌నగర్ ప్రజలు ఇబ్బందులు పడ్డారని, నేడు స్వరాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో మహబూబ్‌నగర్ ఒకటి అన్నారు. పేదలకు ఎక్కడైతే కష్టం నష్టం జరుగుతుందో అక్కడ తాను ఉంటానని మంత్రి తెలిపారు. పాలకొండ ఒకప్పుడు మున్సిపాలిటీలోని మారుమూల గ్రామంగా ఉండేదని ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి రావడమే కాకుండా సమీపంలోని అతిపెద్ద బైపాస్‌రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వచ్చాయన్నారు.
రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల తీసుకొచ్చామన్నారు. ఐటీ ద్యారా సాఫ్ట్వేర్ కొలువులు, లిథియం గిగా పరిశ్రమల ద్వారా పదివేల ఉద్యోగాలు, ఫుడ్‌పార్క్ ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల జీవో తీసుకొచ్చామని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మ్యానిఫెస్టోలోని ప్రధానాంశాలైన దివ్యాంగులకు రూ.6,016, ఆసరా రూ.5,016, సన్నబియ్యం, పేదమహిళలకు నెలకు రూ.3వేల జీవనభృతి, ప్రతికుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా, రూ.400కే సిలిండర్, ప్రతిఇంటికీ సన్నబియ్యం తదితర పథకాలు కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఎకరానికి తాగునీరు అందిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను అన్నివిధాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలంతా సహకరించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మంత్రి సతీమణి శారద, కుటుంబ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్వాల ప్రకాశ్, వార్డు కౌన్సిలర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.