మహబూబ్‌నగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారీ వర్షాలు పడితే గతంలో ఎక్కడ చెరువులు తెగుతాయోనని ఇసుకబస్తాలు పట్టుకొని భయం భయంగా గడిపోళ్లు.. నిద్రహారాలుమాని గ్రామాల్లో రైతులు ఏ కాల్వకు గండి పడుతుందోనని అప్రమత్తంగా ఉండేటోళ్లు.. చెరువులు, కాల్వలు తెగి ఎక్కడ పంట పొలాలు మునుగుతాయోనని ఆందోళన ఉండేది. వర్షాలు పడొద్దని ప్రార్థించిన రోజులు ఉమ్మడి రాష్ట్రంలో కనిపించేది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారిపోయింది. భారీ, ముసురు వర్షాలు కురిసి వాగులు, చెరువులు నిండి అలుగు పారుతున్నా ఎక్కడా ఒక్క చెరువు కూడా తెగి, గండిపడిన దాఖలాలు కనిపించడం లేదు. మిషన్ కాకతీయ పుణ్యమా అని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు పటిష్టంగా తయారై రైతులకు సాగునీటికి భరోసా కల్పిస్తున్నాయి. పట్టణాల్లో, పల్లెల్లో అనేక చెరువులు ఆహ్లాదకర వాతావరణంలో మినీ ట్యాంకుబండ్‌గా రూపుదిద్దుకుంటున్నాయి. ఇదంతా మిషన్‌కాకతీయ పథకం పుణ్యమే అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు విడుతల్లో ఉమ్మడి జిల్లాలో వేలాది చెరువులను
లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పటిష్టం చేశారు.
చెరువుల ఫునరుద్ధరణ
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్ని మండలాల్లో 20శాతం చెరువులను మొదటి విడుతలో, మరో 20 శాతం చెరువులను రెండు, మూడో విడుతల్లో పటి ష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో చెరువుకు రూ.లక్షలు ఖర్చు పెట్టి పునరుద్ధరణకు టెండర్లను ఆహ్వానించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో వందలాది చెరువుల ను పటిష్టం చేశారు. చెరువు కట్టమీద కంప చె ట్లను తొలగించారు. కట్ట ఎత్తు పెం చి తూములు, అలుగులను పటిష్టం చేసి కాల్వలను పునరుద్ధరించారు. చెరువులోని ఒండ్రు మట్టిని తొలగించి నీటినిల్వ స్థాయిని పెంచేలా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు విడుతలుగా 526చెరువులు, 10 చెక్‌డ్యాంలకు రూ. 8319.62కోట్లు ఖర్చుచేశారు.
మినీ ట్యాంకుబండ్లుగా..
పెద్ద పెద్ద చెరువులను, గ్రామాలకు, పట్టణాలకు సమీపంలోని చెరువులను మినీ ట్యాంకుబండ్లుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 20చెరువులు మినీ ట్యాంకుబండ్లుగా మారుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు పెద్దచెరువు మినీ ట్యాంకుబండ్‌గా మారింది. లక్కవరం మాదిరిగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ట్యాంకుబండ్ కింద శిల్పారామం తరహాలో డిజైన్ చేసి నిర్మిస్తున్నారు. విశాలమైన పార్కు, పిల్లలు ఆడుకునేందుకు ఆటవస్తువులు ఇందులో ప్రత్యేకత. ఇక 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న జడ్చర్ల చెరువు ట్యాంకుబండ్‌గా మారింది. కట్టమీద ఆకుపచ్చ గడ్డి, చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు నాటారు. నాగర్‌కర్నూల్ చెరువు హైదరాబాద్ ట్యాంకుబండ్‌కు దీటుగా తయారు చేశారు. కేసరి సముద్రం చెరువు మధ్యలో బుద్దుడి విగ్రహం, లేజర్‌లైట్లు ఏర్పాటు చేయడంతో ట్యాంకుబండ్ అందమే మారిపోయింది.
ఒక్క చెరువుకు గండి పడలే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. అనేకచోట్ల వర్షాలకు రహదారులు కాల్వలను తలపించాయి. అయినా ఒక్క చెరువుకు కూడా గండి పడలేదు. అందుకు కారణం మిషన్‌కాకతీయ పథకంలో చెరువులను పటిష్టం చేయడంతో దృఢంగా ఉన్నాయని పలువురు వాపోయారు. చెరువులు అలుగులు పారాయి. ఎక్కడ చూసినా ఉమ్మడి జిల్లాలో జలసిరులు కనిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణా, తుంగభద్రు నదులు పొంగిపొర్లుతున్నాయి. కాల్వల్లో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నాయి.
‘మిషన్ కాకతీయ’ రైతులకు వరం
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం రైతులకు చాలా ఉపయోగపడుతున్నది. గత పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చెరువులను పట్టించుకోలేదు. గండ్లు పడి తెగిపోతే తప్ప మరమ్మతులు చేసేవారు కాదు. తెలంగాణ ఏర్పడ్డాక ఏర్పాటుచేసిన మిషన్ కాకతీయ పథకం రైతులకు మేలు జరుగుతుంది. దీంతో వందలాది ఎకరాలు సాగుకు నోచుకుంటున్నాయి. రైతుల దిగుబడి మరింత పెరిగింది. కోట్లు ఖర్చుపెట్టి చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల ఒక్క చెరువుకు కూడా గండి పడలేదు. కాల్వలు తెగలేదు. ఇదే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
– చిట్టెం సుచరిత, రైతుబంధు సమితి అధ్యక్షురాలు, నారాయణపేట జిల్లా