కొల్లాపూర్, జూలై 29: రెక్కల కష్టమే ఆస్తిగా ఫొటోగ్రాఫర్ వృత్తినే నమ్ముకొని బతుకుతున్న ఆ పేద ఫొటోగ్రాఫర్ కుటుంబం ఆపదలో పడింది. పూటగడవక దీనావస్థలో ఉన్న ఆ కుటుంబ యజమాని గుండెజబ్బుతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేతిలో డబ్బులు లేక మంచం పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. గుండెమార్పిడి కోసం దాతలు సాయం చేసి పునర్జన్మ ప్రసాదించాలని వేడుకొంటున్నారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ మహబూబ్పాషది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచే ఫొటో చిత్రీకరణలో మెళకువలతో తర్పీదు పొందాడు. పట్టణంలో మహబూబ్ ఫొటోస్టూడియో ఏర్పాటు చేసి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులయ్యాడు. అతడి పేరు తెలియని వారుండరు. ఫొటోగ్రాఫర్ వృత్తితో భార్య, కొడుకు, కూతురుతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవనం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్వల్ప అనారోగ్యం కావడంతో స్టూడియోను తీసేశాడు. రెండు నెలల కిందట తీవ్ర అనారోగ్యం పాలైన మహబూబ్‌పాష అప్పు చేసి హైదరాబాద్‌లోని కేర్ దవాఖానలో వైద్యులను సంప్రదించాడు.
వైద్యులు గుర్తించి గుండెమార్పిడి చేయాలని, లేకుంటే బతుకడం కష్టమని చెప్పినట్లు బాధితుడు ’నమస్తే తెలంగాణ’తో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే వైద్య పరీక్షలకు గానూ సుమారు రూ.5లక్షల వరకు ఖర్చవుతుంది. రిపోర్టులను బట్టి గుండె మార్పిడి ఆరోగ్యశ్రీలో చేస్తామని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నాడు. వైద్య పరీక్షలకు కావాల్సిన డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో మందులతో బతుకీడ్చుతున్నాడు. వృత్తిని కొనసాగిద్దామనుకుంటే ఆరోగ్యం సహకరించకపోవడం, పూటగడవక కుటుంబ సభ్యులు దీనావస్థలో బతుకుతున్నారు. కండ్ల ముందు ఇంటి యజమాని ప్రాణాపాయస్థితిలో ఉండడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. దాతలు సాయం చేసి ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధేయపడుతున్నారు. వివరాలకు 9963583216 నెంబర్‌కు సంప్రదించాలని, ఫోన్‌పే/గూగుల్ పే 9394836717నెంబర్‌కు దాతలు సాయమందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.